Saturday, May 22, 2010

సందేహం...సందిగ్ధం...

ఈ కాంక్రీటు అడవిలో,
చీమలవలె మసలే మనుష్యుల రొదలో,
నను నేను వెతుకాడె పనిలో,
పనిలో, వనిలో, గజిబిజి అలజడుల ధ్వనిలో,
నా యవ్వన ఆవేశపు బడబాగ్నుల వడిలో, ఒడిలో
ఊహల బలినై, అణిచే వామనుడనై,
సంచరించి...సంచలించి...
అలసి...సొలసి...మైకమై.....

నా దారి ఎడారి

స్నేహితులా స్వార్ధచింతనులు,
బంధువులా మోసపూరితులు,
తల్లిదండ్రులా అసక్తులు,
పరిస్థితులా అశనిపాతాలు...

దురదృష్టానికి పరాకాష్టను,
అదృష్టానికి పేదవాడను.....

ఆశలు మదిలో పువ్వులై అల్లుకున్నను,
ఆ పువ్వుల మకరందాన్ని ఆస్వాదించలేని తుమ్మెదను.....

మేక వన్నె పులుల మెర మెచ్చు మాటలలో కొట్టు మిట్టాడుతున్న అమాయకుడను.....

కనుకే నా మనసు చెప్పింది నా దారి ఎడారని,
నేను వెతుకుతున్నాను నా భావ దాహాన్ని తీర్చే ఒయాసిస్సుని....

బ్రతుకు నావ

ఆలోచనల సహవాసంతో
ఆకాంక్షల ఆలంబనతో
కదులుతోంది కాలం నా భవిష్యత్తు వైపు...

అందమైన తీరాలను దాటుకుంటూ
మధురమైన అనుభూతులను ఆస్వాదిస్తూ
మరువలేని జ్ఞాపకాలను మిగుల్చుకుంటూ
పరిస్థితుల పెను తుఫానులు ఎన్ని ఎదురైనా ఆగనని చాటుకుంటూ కదులుతోంది....

ప్రశ్న

సమాధానం చెప్పలేను నాకు ఎదురైన ప్రశ్నలకు..
అందుకే మౌనాన్ని నేను వలచా,
ధైర్యంగా పరిస్థితులను ఎదిరించ నిలువదలచా....
నన్ను నేను మలుచుకుంటూ, విజయగీతికను పాడదలిచా....

ఆశల మేఘం

నా ఆశలమేఘమా ఏమని పిలవను నిన్ను...
ఆలోచన అనా...ఉహ అనా...
ఆవేదన అనా...ఆనందం అనా...
నువ్వు జార్చే ప్రతి చినుకు నన్ను తడిపేస్తుంది...
ఆ తడి నా కంటిని చేరి నీ వైపు నుండి దృష్టి మరల్చనీయకుంది...

యాతన

ఏడ్వలేక నవ్వుతున్నా నవ్వురాని వేళన
నవ్వి నవ్వి దాచుతున్నా గుండెలోని యాతన....
తలను దించి మనసునొంచి అభిమానము అడ్డు తొలచి,
ఏడ్వలేక నవ్వుతున్నా నవ్వురాని వేళన...
కనుల నీరు దాచిపెట్టి పంటి బిగువు బాధ నొక్కి,
నవ్వి నవ్వి దాచుతున్నా గుండెలోని యాతన....

ఆశల సౌధం

కాలంతో కాదులుతువున్నా,
అర్ధం కాని ఆలోచనలతో సతమతమవుతున్నాను....
ఆశల సౌధాలు నిర్మించుకుంటున్నా,
వాటి పునాదులను నేనే కూల్చుకుంటున్నాను....

పయనం

ముందు దారి ఏదైనా వెనుతిరిగి చూడొద్దు
ఎంత ముందుకు వెళుతున్నా వచ్చిన దారి మరవద్దు...
ప్రతి ఆశ పూదండై నీ మెడలో నిలవాలి
కన్నీటి కడలిలోన సిరినావై కదలాలి...

అందరివాడిని నేను

విశ్వాన్ని కాదు శూన్యాన్ని కాదు
అణువును కాదు అనంతాన్ని కాదు
ధేనువుని కాదు వ్యాఘ్రాన్ని కాదు
కాలిపోయే పేడును కాదు
కాల్చివేసే పిడుగుని కాదు
మాయ చేసే మాంత్రికుడిని కాదు
మోసపోయే అమాయకుడిని కాదు
మహర్షిని కాదు రాక్షసుడిని కాదు
మామూలు మనిషిని నేను
మీ అందరివాడిని నేను...

ప్రేమించాలని ఉంది

ప్రేమిచాలని ఉంది నాకు సాటి మనుషులను

నాతో నడచిన వారిని,
నాతో స్నేహం కలిపిన వారిని,
నేను పోట్లాడినవారిని,
నేను గెలిచిన వారిని,
నేను ఓడిన వారిని,
నా వారిని పరాయిని అందరిని...
స్వార్ధం నడిచే ప్రపంచంలో, స్వార్ధం నేర్చిన సమాజంలో
ధైర్యం కావాలి నాకు...
సాటి మనిషిని మనిషిలా చూసేందుకు...
అందరు నాతో సమానమని తలచేందుకు...

భారతీయుడిని నేను

ఏ జాతి నీదని అడగకు నన్ను
ఏ రంగు నీదని అడగకు నన్ను
మనిషినని చెప్పుటకు సందెహించను నేను...

ఏ మతము నీదని అడగకు నన్ను
ఏ కులము నీదని అడగకు నన్ను
భారతీయుడైన నాలో ఆ ప్రశ్నలకు తావు లేదు...

సమైక్యతా సమభావం
సమన్యాయం సౌభాగ్యం
మన నినాదం కావాలి...

నీ ప్రాంతం నా ప్రాంతం
నీ వూరు నా వూరు
వేరు వాదం వీడాలి...